చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ

  • మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
  • మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్న దాదాపు అన్ని పార్టీలు
  • డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల విముఖత

భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుండి గరిష్ఠంగా 850కి పెంచే ప్రతిపాదనతో కూడిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


2011 జనాభా లెక్కల ప్రాతిపదికన దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు, అందుకోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బిల్లులపై ఉభయ సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే మరో బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మూడు బిల్లులపై ఒక్కో సభలో సుమారు 18 గంటల పాటు ఎంపీలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ నేడు సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ఈ బిల్లుల ఆమోదంతో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండటంతో, ప్రధానమంత్రి ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


Parliament
Parliament Special Session
Women Reservation Bill
Delimitation
Amit Shah
Arjun Ram Meghwal
Lok Sabha
Indian Politics
Narendra Modi
Political News

More Telugu News